స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday 16 December 2019

ఇంకొక్క సారి విరపూస్తూ

వందేళ్ల తెలుగు కథ 
ఇంకొక్క సారి విరపూస్తూ 
కథ కు కష్టానికి పాతదనం ఏముంటుంది !
ఖదీర్ బాబు గారికి అభినందనలు . 

నాటకం గా మారిన బాంబే టైలర్స్

జీవితం నాటకం 
కాకుంటే అది మరణం తరువాత తెలుస్తుంది 
చేసిన తప్పులు ఒప్పులు ఎన్నో మలుపులు ....  
నాటకం జీవితం లో నుండి వస్తే 
జీవితం నుండి వచ్చిన కథ లో నుండి వస్తే 
ఆ కథా రచయితకు తెలీకుండా భాషల ఎల్లలు దాటి ఎన్నో హృదయాలు తాకితే 
కలం నుండి వచ్చిన పాత్రలు మనుషులుగా మారి విందుగా, కనుల విందుగా 
ఆ కథా రచయితనే పలకరిస్తే !
ఎలా ఉంటుంది?
దానికి వచ్చిన అవార్డ్స్ ,చప్పట్ల శబ్దాల్లో 
ఆ పాత్రలతో కూర్చోడం ఎలా ఉంటుంది?
ఇదిగో కేరళ చేరి నాటకం గా మారిన బాంబే టైలర్స్న్యూ  లాగా ఉంటుంది,
పాత్రల మధ్య తృప్తిగా నవ్వుతున్న ఖదీర్ బాబు లాగా ఉంటుంది. 
కష్టం కథ గా మారితే అదే భాష హద్దులు దాటేస్తుంది. 
కథ అంటే చరిత్ర ఖదీర్ బాబును గుర్తుకు చేసుకుంటుంది. 
ఇంకొంచెం కష్టాలను పలకరించమంటూ దారి చూపుతుంది. 


Saturday 20 July 2019

కొత్త కథ 2019


వసంతం ఎంత బాగుంటుంది!
ఎన్నో పూలరంగులు బుగ్గలకు పూసుకుంటూ 
ఆలా చెట్లు నవ్వులతలలు ఊపుతూ ఉంటే 
ఏడాదికి ఎన్నోసార్లు వసంతం వస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది 
మళ్ళీ మళ్ళీ ఆ  సువాసనమోహం లో మునిగిపోయినాసరే 
ఆ పూలరంగులను మనసులో దాచుకోవాలి అనిపిస్తుంది 

ఈ కొత్త కథా వసంతం మాత్రం తక్కువా ఏమిటి!
మోదుగ ఎరుపు విప్లవాలు 
మొగలిపూవులా చురుక్కుమనిపించేవి 
ప్రేమ గులాబిరంగును అద్దేవి 
ప్రపంచీకరణ ను చూపే లిల్లీలు 
మనసును ఒక పట్టాన వదలని మల్లెలు 
బోలెడు ఆలోచనలను మనపై రాల్చే పొగడలు 
తమ ఉనికి చిన్నదైనా సఫలతను చేరుకొనే సొగసు పారిజాతాలు 
ఎన్నో కలాల కొమ్మలకు పూచిన పూలను ఒకటిగా చేర్చిన దారం ఒక్కటే 
రండి ఆ వసంతాన్ని చూసి మళ్ళీ మళ్ళీ రావాలని పిలుద్దాము .... 

కొత్త కథ ఆవిష్కరణ ఆదివారం 21-7-2019 న... ఇదే అందరికీ ఆహ్వానం.. 

ఖదీరుగారి మాటల్లోనే ఆహ్వానం అందుకోండి!

అందరూ...
బెజవాడ నుంచి సత్యవతి గారొస్తున్నారు. 
మంచిర్యాల నుంచి రాజన్న. బెంగళూరు నుంచి వివిన మూర్తిగారు. 
చెన్నై నుంచి అరాత్తు. ఇతర ఊర్ల నుంచి మిత్రులు. 
ఇంకా హైదరాబాద్‌లోని చాలా దారులు రాబోయే ఆదివారం నాంపల్లి వైపు చూస్తాయి. 
కొత్త కథ 2019 ఆవిష్కరణ అంటే సాహితీ మిత్రులంతా జత కూడే వేడుక.
 ముందుతరం రచయితలకు కృతజ్ఞత ప్రకటించే ఉత్సవం. తేదీ గుర్తుపెట్టుకోండి.




Monday 27 May 2019

ఒక మంచి వాక్యం

ఒక మంచి వాక్యం 

అమావాస్య చీకట్లు చుట్టూ నిండినపుడో 
ఆశలు ఆత్మీయతలు నిండుకున్నప్పుడో 
ఒక్క వాక్యం కావాలి 
ఒక్క మంచి వాక్యం!
నీకేమి కాదు అని భరోసా ఇస్తూనో 
అల్లా ఉన్నాడు అని దారి చూపిస్తూనో 
అమ్మ లాగ రెండు దెబ్బలు వేసినా పర్లేదు 
అమ్మమ్మ లాగా దగ్గర తీసినా ఫర్లేదు 
ఒక్క మంచి వాక్యం అల్లాను ఈ హృదయం లోకి నడిపిస్తూ 
రంజాను తరువాతి నెలవంక తీసుకువస్తే బాగుండును !
ఒకే ఒక్క వాక్యం 
''అల్లా అచ్చా కరేగా "
రంజాన్ శుభాకాంక్షలు. 

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

ఆంధ్రజ్యోతిలో ‘నిజం’ శ్రీరామమూర్తిగారు ఎడిటోరియల్స్ రాస్తారని తెలియని కాలేజీ రోజుల్లోనే ఆయన రాసే వచనంలోని సరళత గమనించి చదువుతుండేవాణ్ణి.
ఆంధ్రప్రభ ఎడిటోరియల్స్ వచనానికి, వాగాడంబరానికి మించి.
ఈనాడు ఎడిటోరియల్స్‌లో కృతక చొరబాటుతో నిండిన జాతీయాలు, సామెతల తగిలింపు ఇబ్బంది. ‘బదబదాలు’ అనే మాట ఏ.బి.కె ప్రసాద్‌గారు మాత్రమే వాడేవారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని ఎవరు వ్యాసాన్ని ముగించినా మళ్లీ వాళ్ల అక్షరాల వైపు తొంగి చూసేది కూడా లేదు.
నా అదృష్టం తిరుపతి పాత అంధ్రజ్యోతిలో ఆ కాలంలో పని చేయడం. అనంతపురం కరువు గ్రామాల్లో నామిని టూర్ చేసి ఆ టూర్ రిపోర్ట్ సండే కవర్ స్టోరీగా రాస్తే కడుపులో కన్నీరు ఉబికేది. ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు వచనం డిసెంబరు మాసపు గుమ్మడి పూతలా కళకళలాడుతూ ఉండేది. సౌదా పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండొచ్చి ఆ పాఠాలు కథనం చేస్తే వచనపు తొలిపాదం, మలిపాదం తెలిసి వచ్చేది. జి.ఆర్.మహర్షి బొడ్లో నుంచి తీసే బాకులా వాక్యాన్ని మెరిపించేవాడు.
హైదరాబాద్ వచ్చాక అతని కంటే ఘనుడు ఆర్టిస్ట్ మోహనే అని తెలిసి వచ్చింది. వేగం, మోహం, చనువు, చొరవ ఉన్న ఆతని ‘కార్టూన్ కబుర్లూ’ ఆ తర్వాతి ఎన్నో వ్యాసాల అక్షరాల గుబుర్లూ జాగ్రత్తగా కనిపెట్టి, పట్టి, నేనొక వచనం బొటనవేలు, చూపుడువేలు మధ్యన పట్టుకున్నాను.
శుభ్రమైన వాక్యం వేమన వసంతలక్ష్మి వద్ద ఉంది. పదునైన వాక్యం కాత్యాయని చెంత కలదు. పతంజలి వాక్యం డబుల్ బ్యారల్ గన్. తల్లావఝలశివాజీ కే పాస్ భీ మా హై.
అల్లం నారాయణ రాస్తే ఉర్దూ చిత్తు కాగితంలో చుట్టి తెచ్చిన మురబ్బాను బుగ్గన పెట్టుకున్నట్టు ఉంటుంది. మృణాళినికి కృతి తెలుసు. కాన వచన ధృతి తెలుసు. అనువంశిక వశానా `సరస్వతి గిరిప్రదక్షిణ’ చేతా శ్రీరమణ సాక్షాత్కరింపజేసుకున్న వాక్య పురుషునికి చిరంజీవత్వం ఉంది తప్ప సంతానయోగం లేదు. క్లోనూ లేదు. ప్రకృతి స్పర్శ లేనిదే కుప్పిలి పద్మ వాక్యం ఉండదు.
కె.శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్.వేణుగోపాల్... తప్పించేసిన ఆకతాయి పిల్లవాడి చిందర వందర వచన సౌందర్యం కోసం నేను సాగిస్తున్న అన్వేషణ ఇప్పట్లో తీరదు. సతీష్ చందర్‌ది ఆరోహణ అవరోహణల వెన్నెల. తలపోత వచనంలో పసలపూడి వంశీ పసను ఎంచాలి.
వచనం ఒక వొడుపైన మంత్రసాని. తల్లీబిడ్డలకు మల్లే పాఠకుణ్ణి, రచయితను ప్రాణాలతో నిలపాలి.
కనుక శ్రీధర్ నామాడి, మల్లంపల్లి సాంబశివరావు, అనంతు చింతలపల్లి, కందుకూరి రమేశ్‌బాబు... లాంటి ‘క్లాస్ ఆఫ్ 95’ బ్యాచ్ అయిన మేమంతా ఒకే కాలంలో వచనం అనే ఏనుగు కాళ్ల దగ్గర వేళ్ల దగ్గరా తచ్చాడి, కావాలని లద్దె తొక్కి, దంతం వంటి దృఢమైన వాక్యం కోసం ఆశ పడినవారం.
ఈ ప్రయాసకు మేమే చివరి ప్రతినిధులం అనుకుంటూ ఉండగా పత్రికలలో ఏమో కాని కథల్లో ఆరని సిరా కలిగిన యువకులనేకులు వచ్చారు. సామాన్య, మెహర్, అనిల్ ఎస్.రాయల్, పూడూరి రాజిరెడ్డి, భగవంతం, రిషి శ్రీనివాస్, పూర్ణిమా తమ్మిరెడ్డి, వెంకట్ సిధారెడ్డి... జబ్బల్లో కండ కలిగిన ఇలాంటి కళాసీలను చూసి తెలుగు కథాఓడ చులాగ్గా మరిన్ని నీలిమల్ని ముక్కుతో చీల్చగలిగింది.
కాని-
అంతకు సమానమైన సరంగులు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కెరటాలు బాదుతూ కనిపిస్తుండటం తెలుగులో నిజమైన వచన సందర్భం.
అది హింగ్లిష్ కాదు. తెంగ్లిష్ కాదు. వక్కల ముక్కల తెలుగు కాదు. ఎండు పచ్చి మిరప కాదు. ఎంచుకున్న పదాలతో, ఎంపిక చేసుకున్న మాటలతో, ఎదుటి వారికి చెప్పదలుచుకున్నది చెప్పాల్సిన కంఠంతో, సిద్ధాంతమైనా, అభిప్రాయమైనా, విమర్శ అయినా, ప్రతి విమర్శ అయినా, తిట్టైనా, వెక్కిరింతైనా పూర్తి తెలుగులోనే సరియైన తెలుగులోనే రాస్తున్న ఈ తరం ప్రతినిధులు తెలుగును తళతళలాడించడానికి కొత్త దేశీయ వాషింగ్ పౌడర్‌ను పట్టుకు వచ్చారా అనిపిస్తోంది.
వీరంతా ఎప్పుడు ఎలా ఈ వచనం నేర్చుకున్నారు?
రోజూ నిద్ర లేచి ఒక పచ్చి వాక్యాల మోపును తెచ్చి ఫేస్‌బుక్‌లో పడేస్తున్న వీరిని చూసి తబ్బి ఉబ్బిబ్బవుతున్నాను.
అరుణాంక్ లత, నరేష్కుమార్ సూఫీ, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, రజిత కొమ్ము, శతపత్ర మంజరి, గుర్రం సీతారాములు, సౌమ్య పి.ఎస్, ఇండస్ మార్టిన్, జిలుకర శ్రీనివాస్, సిద్దార్థ గౌతమ్, మహేశ్ కత్తి... ఇంకా నేను గమనించని అనేకులు నేటి ప్రాక్టీషనర్స్ ఆఫ్ ప్రోజ్. వచనాశ్వాన్ని నురగలు కక్కిస్తున్న రౌతులు.
మరో పదేళ్లకు వీరంతా మెత్తబడవచ్చు. అనుభవం, క్షమాగుణం, సానుభూతి, ఉపేక్ష వీరి వచనంలోని ఆమ్ల క్షారతల ఘాడతలను మింగేయవచ్చు. ఈలోపు కొత్తవారు పోటెత్తవచ్చు.
అందాక-
వేయి అర్థవంతమైన చర్చలు జరగనీ.
లక్ష మెరుపుల వచనం పరిఢవిల్లనీ.

Friday 3 May 2019

ముందే ఢిల్లీ వచ్చిన నెలవంక


మే' లో రంజాన్ రోజు రావలసిన నెలవంక కొంచెం ముందుగా 
స్త్రీల కథల రూపం లో ఏప్రిల్ 19 నే ఢిల్లీ కుతుబ్ మినార్ మీదకు వచ్చేసింది. 
రాష్ట్రాలు దాటి దేశ రాజధాని వరకు తెలుగు కథ ప్రయాణం ఇది!

ఏప్రిల్ ఇంకో విశేషం కూడా ,ఈ నెలకి కథకుడు అర్ధజీవితాన్ని ఇంకో 3 ఏళ్లకు  
పూర్తి చేస్తాడు. 
అర్ధ జీవితం అంటే!
ఎంత దూరం వచ్చినట్లు 
కాలప్రవాహం పక్కన రాయిలా నిలుచున్నా 
మార్పు వస్తూనే ఉంటుంది. 
కాకుంటే అది అల్లా వైపో ,సైతాన్ వైపో!
సరిగ్గా పన్నెండు అమావాస్యలు దాటగానే 
రంజాన్ నెలవంకగా చూపి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు 
ఇంకొంచెం తప్పులు సరి చేసుకోవడానికి 
అమ్మ దీవెనలే కాదు ఆయువు పోసేది 
గండం ఉన్న రోజు 
మన చేత నలిగిన హృదయాలు గాయాన్ని మరచి నీ కోసం చేసిన ప్రార్ధనలు కూడా !
ప్రతి ఏడాది నెలవంక అల్లా దీవెన 
ఎన్ని హృదయాలు గెలుచుకుంటావో అన్ని కృతఙ్ఞతలు చూపించు!
కృతజ్ఞతలే తీర్పు దినాన మన వెంట వచ్చేది 
మరో అమ్మ కడుపులో జన్మించే వరాన్ని ఇచ్చేది!

ఢిల్లీ లో జరిగిన ఆవిష్కరణ గురించి ఖదీర్ బాబు మాటల్లో ..... 

ఢిల్లీ మిత్రుడు
- మహమ్మద్ ఖదీర్‌బాబు
1997లో నా ‘దావత్’ కథ వచ్చింది. 1995లో తొలి కథ ‘పుష్పగుచ్ఛం’ వచ్చినా నన్ను వీపు మీద తట్టి ‘కేర్’మనిపించి ఇదిగో వీడొచ్చాడు చూడండి అని లోకానికి చూపిన కథ అది. అప్పట్లో న్యూఢిల్లీలో ‘కథ’ సంస్థ ప్రతి ఏటా ఒక్కో భాష నుంచి ఒక్కో ఉత్తమ కథను ఎంచి జాతీయస్థాయి ‘కథ’ పురస్కారాలు పతిష్టాత్మకంగా ప్రకటించేది. ఆ పురస్కారం కోసం తెలుగు కథకు ‘నామినేటింగ్ ఎడిటర్’గా ఉన్న దాసరి అమరేంద్ర కంట ‘దావత్’ పడినా ఎందుకో అది నామినేషన్ వరకూ వెళ్లలేదు. 1998లో నా ‘జమీన్’ కథ వచ్చింది. ఈసారి కూడా నామినేటింగ్ ఎడిటర్‌గా ఉన్న అమరేంద్ర దానిని అవార్డు కోసం నామినేట్ చేశారు. మూడు కథలు నామినేట్ చేస్తే గోపిని కరుణాకర్ ‘దుత్తలో చందమామ’కు, నా కథకు (రెండూ బాగున్నాయని చెప్పి) అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోవడానికి మొదటిసారి ఢిల్లీ వెళ్లాను. కనుక నా మొదటి ఢిల్లీ పర్యటనకు అమరేంద్ర నేరుగా కారణం.
రచయితగా, భ్రమణ అనుభవాలను లిఖితం చేసే రచయితగా ఆయన చేసిన కృషి వేరేగానీ అమరేంద్ర ప్రధానంగాసాహితీ ప్రోత్సహకులు. చాలా స్నేహశీలి. కానీ విభేదించాల్సిన విషయాలు వస్తే వాటి గురించి నిలబడటానికి వెనుకాడరు అని నేను అనుకుంటూ ఉంటాను. ఢిల్లీలో సాహితీ వాతావరణం చేతనలో ఉండటానికి ప్రధాన కారకుల్లో ఆయన ఒకడు. చాలా వరకు ఇల్లే సమావేశ స్థలి. ఆయన శ్రీమతి లక్ష్మి నవ్వు చెదరకుండా ఆ సమావేశాలను హోస్ట్ చేయడం నేను చూశాను.
బృందాలు కూడగట్టడం, బృందంలో ఒకడుగా ఉండటం, బృందాన్ని వెతుక్కుంటూ వెళ్లడం కృతక ప్రదర్శన కోసం కాక అమరేంద్రకు సహజంగా అబ్బిన జీవనశైలి. కనుక కె.సురేశ్, నేను నిర్వహించే ‘రైటర్స్ మీట్’ వర్క్‌షాప్‌లకు పర్మినెంట్ సభ్యుడు. ఉన్నతోద్యోగిగా పూణెలో ఉండగా మమ్మల్ని ఉత్సాహపరచి అక్కడో వర్క్‌షాప్ నిర్వహించేలా చేశారు. బస? షరా మామూలే. ఆయన ఇల్లు. మా అందరినీ పశ్చిమ కనుమల్లోకి తీసుకెళ్లడము, ఆ మెలికల కులుకుల దారుల రోజ్ టింట్ పర్వతాలు, పై అంచున కృష్ణానది జన్మస్థలి, పంచ్‌గని దారుల దిమ్మెల పై ఎర్రై స్ట్రాబెర్రీ పళ్లు, లోనావాలా చిక్కీ... అమరేంద్ర వల్లే నిక్షిప్తమైన జ్ఞాపకం. పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చెట్టు నీడన శాంతారామ్‌ను స్మరించుకోవడం కూడా.
ఇదే కాదు దీనికి ముందు, దీనికి తర్వాత, నిన్న మొన్నటి ‘ఉత్తరాంధ్ర సాహితీ పదయాత్ర’ వరకు అమరేంద్ర చాలా కార్యక్రమాలకు కేటలిస్ట్. సంకల్పం సడలనివ్వని కార్యకర్త.
ఢిల్లీలో ఎండలు ఇటు వస్తువా అన్నట్టు మమ్ము చూసి హూంకరించాయి. కాని అమరేంద్ర తన సమక్షంతో అవి చల్లనైనవే అనిపించారు. రాష్ట్రపతి భవన్ పచ్చిక మైదానం, లోడీ గార్డెన్ పువ్వులు మా సంతోషకరమైన నవ్వులు విన్నాయి.
అమరేంద్ర పూనికతో ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు వెంకట్రామయ్య, హిందీ అనువాదకులు జె.లక్ష్మిరెడ్డి గారు,ఇతర ‘సాహితీ వేదిక’ సభ్యులు ‘స్త్రీ కథలు 50’ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించి ఆదరంతో పాల్గొనడం ఆ పుస్తకంలోని రచయితల పట్ల వారు చూపిన గౌరవంగా భావిస్తాను.
రాలే పూలకొమ్మను చూసి ఆగి, పారే పాయ సవ్వడి విని ఆగి, ఎండిన ఆకుల బాటతో సంభాషణ నెరిపి స్నేహం చేయడానికి ఇష్టపడే అమరేంద్ర మీరు గనక ఒక పుస్తకం చదివినవారై, ఒక కథను రాసిన వారైతే ఢిల్లీలో తారస పడక మానరు. ఆతిథ్యాన్ని ప్రస్తావించక ఊరుకోరు.
కలుస్తానంటారా?
టికెట్ల ధరలు ఎండల కంటే ఎక్కువగా మండిపోవడం లేదూ?
పి.ఎస్: 2001లో ‘న్యూ బాంబే టైలర్స్’కు రెండోసారి ‘కథా అవార్డు’ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అవార్డు తీసుకోవడానికి వచ్చి పరిచయమైన ఒక తమిళ రచయిత్రి గురించి, ఆమెను పాత్రధారిగా చేసి (ఆ వేడుకకు హాజరైన) ప్రసిద్ధ కొంకణి రచయిత దామోదర్ మౌజో రాసిన కథ గురించి మళ్లెప్పుడైనా చెప్తాను. అది కూడా మీరు వినదగ్గది.

Monday 1 April 2019

స్త్రీ ల కథలు

స్త్రీ ల కథలు 
యాభై !!!!!!!!
పునఃకథనం అయితే కావొచ్చు 
అసలు కథల లోతుకు  తీసుకొని వెళుతూనే ఉంటాయి 
ఇవి కథలు కాదు 
యాభై కోణాల్లో స్త్రీ జీవితపు వ్యథలు 
బహుశా పుట్టక ముందు  చదివితే స్త్రీగా పుట్టడానికి ఇష్టపడక పోవచ్చు!
పుట్టాక చదివినా చేసేది  ఏమీ లేదు 
అసలు స్త్రీ సమస్యలకు ఫుల్ స్టాప్ లేదు 
 విరామ చిహ్నం  తప్ప !
కాకుంటే తరాలు మారే కొద్దీ సమస్యలు మారుతుంటాయి 
దేహంగా మిగిలిన స్త్రీ ది  అసలు మనిషి జన్మ కాదు!
అవసరాలు తీర్చే పరికరం తప్ప!
పోయిన తరాలను మార్చుకోగలం అనే ఆశ లేదు 
ముందు తరాల మూలాలు అయినా స్త్రీ గౌరవానికి బాటలు వేసేట్లు నిర్మిద్దాము!
ఎంతైనా వాళ్ళు స్త్రీ సృష్టే కదా !

ఖదీర్  మాటల్లో స్త్రీ పుస్తకం గురించి చదవండి ...... 



ఆ 50 కథలు
- మహమ్మద్ ఖదీర్‌బాబు
గతి లేదు. వేరే దారి లేదు. పెళ్లయినవాడికే రెండో భార్యగా వెళ్లక మరో గత్యంతరం లేదు. ఆమె వెళుతుంది. ఆమె అలాంటి పరిస్థితుల్లోనే వచ్చినట్టు అతడికి తెలుస్తుంది. అప్పుడు ఆమె కాళ్లకు చుట్టుకునే చీకటి ఎలా ఉంటుంది? విమల రాసిన ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ కథను చదవాలి.
పెళ్లయ్యే అవకాశం ఇప్పుడిప్పుడే కనపడ్డం లేదు. సరైన ముండాకొడుకు ఒక్కడూ దొరకడం లేదు. దొరికినవాడు ఎదురు వంకలు పెట్టి పోతున్నాడు. వయసు పెరుగుతోంది. మోకాళ్ల పైనుండే కండలు లావెక్కుతున్నాయి. ఎప్పుడూ మూడెంక వేసుకు పడుకోబుద్ధవుతుంది. ఏమిటో తెలియదు. డాక్టర్ దగ్గరకు వెళ్లితే ప్రిస్క్రిప్షన్ మీద ‘పెళ్లి’ అని రాసి ఆ కాగితాన్ని బర్రున చింపి చేతిలో పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి? పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన ‘ఆర్ ఎక్స్ డాక్టర్’ కథ ఇది.
కింద నుంచి నీళ్లు మోయాలి. పై నుంచి మాటలు పడాలి. మొగుడు ఇంటికి ఆధిపత్యపు తాళం, బీరువాకు చిల్లర అందని తాళం వేసి పోతాడు. జ్వరం వస్తుంది. కాని అలా వస్తే మగాడు డాక్టర్ దగ్గరకు వెళ్లే యోగ్యుడు అవుతాడు కానీ ఆడది అవుతుందా? పిల్లలు సతాయిస్తుంటారు. ముసలి అత్తమ్మ దీనంగా చూస్తుంటుంది. చాలదన్నట్టు ఒంటిని జ్వరం కాలుస్తూ ఉంటుంది. ఇదంతా పట్టని మొగుడు రాత్రి రెండు పెగ్గులు బిగించి వచ్చి పక్క మీదకు చేయి లాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘విసుర్రాయి’ కథలో పడి నలగాలి.
అలా శ్రీకాకుళం వైపు వెళ్లండి. అక్కడ సలీసుగా దొరికే అమ్మాయిల కండ కోసం ఎన్ని గద్దలు ఎగురుతున్నాయో.. మన్నెం సింధుమాధురి ‘తూరుపు కండ’ కథలో చూపిస్తుంది.
వందేళ్లట తెలుగు కథ వయసు. ఎంతకూ సమర్తాడని అమ్మాయి మనసులో ఏముంటుంది... అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరైనా రాశారా? కరుణ కుమార్ ‘పుష్పలత నవ్వింది’ కథలో ముగింపుకు మీ పెదాల మీద కూడా ఒక చిర్నవ్వు పూస్తుంది.
ఎన్ని కథలు. ఎన్నని.
వందేళ్లలో ఎందరో రచయిత్రులు, రచయితలు స్త్రీల తరఫున గట్టిగా మాట్లాడారు. పేచీ పడ్డారు. పెనుగులాడారు. మగాణ్ణి ప్రత్యర్థిగా నిలబెట్టి ‘మగాడూ మారూ’ అని నిలదీతను నుదుటికి బిగించి కట్టుకున్నారు.
కాని అల్లాంటి కథలన్నీ ఒక చోట చేరలేదు. ఎందుకనో అలాంటి కూర్పు సాధ్యం కాలేదు.
రేప్ విక్టిమ్ మనసు లోపలి గాఢత, ఎంతగా తోమినా వదలని చిలుము వాడ్రేవు చినవీరభద్రుడు తన ‘సుజాత’ కథలో మన కొరకే రాశాడు.
తోడు పేరుతో స్త్రీ చుట్టూ అల్లే ట్రాప్‌ను చూడగలిగే చూపు ఓల్గా ‘తోడు’ కథతో మన కథల్లోనే సాధ్యమైంది.
నల్లమల అడవుల్లో చీకటి బిలంలో దెయ్యం వదలగొట్టించుకోవడానికి ఒక గృహిణి వెళితే వదలగొట్టాల్సింది దెయ్యాన్నా మగాడి అహంకారాన్నా అని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఎంతో ఆర్ద్రంగా ‘బిలం’ కథ రాస్తే మన కళ్లే కదా వెచ్చగా ధారులు కట్టేది.
గోషా పాటించాల్సిన ముస్లిం పెళ్లికూతురికి టాయిలెట్ లేకపోవడం ఒక కథ (షాజహానా). ఆడుకోవాల్సిన పిల్లను ఈడ్చుకెళ్లి వేపమండలు చుట్టి బసివిని చేయడం ఒక కథ (సుందర్రాజు).
ఇవన్నీ ఒకచోట చేరిన సందర్భం ఇది.
యాభై మంది రచయిత్రులు, రచయితలు అల్లిన బలమైన కథల మోపు.
భండారు అచ్చమాంబ, చలం, శ్రీపాద, ఇల్లిందల సరస్వతీదేవి... వీరు నడిచిన దారిలో నేడు నడుస్తున్న పాదాల వరకూ సాగిన కథలు ఇవి. యాభై గట్టి కథలు. మేలిమి కథలు. తెలుగు స్త్రీ కథ అంటే చప్పున అందుకోవాల్సిన కథలు.
ఈ కథలు నేను మళ్లీ చెప్పగలిగే అవకాశం రావడం అదృష్టం.
ఈ కథలు నడిచిన దారులో నా కలం పునర్ ప్రయాణం చేయడం అపురూపం.
అందరికీ నమస్కారాలు. కృతజ్ఞతలు.
‘స్త్రీ కథలు 50’ సంకలనంలోని రచయిత్రులు- రచయితలు:
1. అబ్బూరి ఛాయాదేవి 2. భండారు అచ్చమాంబ 3. చలం 4. చాగంటి తులసి 5. సి.సుజాత 6. సి.వనజ 7. చంద్రలత 8. చంద్రశేఖర్ ఆజాద్.పి 9. గీతాంజలి 10. గోగు శ్యామల 11. ఇల్లిందల సరస్వతీదేవి 12. ఇంద్రగంటి జానకీబాల 13. జూడీ బ్రాడీ 14. ఝాన్సీ పాపుదేశి 15. కల్యాణ సుందరీ జగన్నాథ్ 16. కె.రామలక్ష్మి 17. కేతు విశ్వనాథ రెడ్డి 18. కవన శర్మ 19. కుప్పిలి పద్మ 20. కొండేపూడి నిర్మల 21. కె.వి. కరుణ కుమార్ 22. ముదిగంటి సుజాతారెడ్డి 23. మృణాళిని 24. మన్నెం సింధుమాధురి 25. నాగప్పగారి సుందర్రాజు 26. పి.సత్యవతి 27. పాటిబండ్ల రజని 28. పాలగిరి విశ్వప్రసాద్ 29. పూర్ణిమ తమ్మిరెడ్డి 30. రంగనాయకమ్మ 31. రెంటాల కల్పన 32. రాధిక 33. రుబీనా పర్వీన్ 34. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 35. సావిత్రి 36. ఎస్.జయ 37. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 38. షాజహానా 39. సామాన్య 40. సాయి బ్రహ్మానందం గొర్తి 41. తల్లావఝల పతంజలి శాస్త్రి 42. తాయమ్మ కరుణ 43. ఓల్గా 44. వి.ప్రతిమ 45. వాడ్రేవు చిన వీరభద్రుడు 46. విమల 47. వినోదిని 48. వేంపల్లి షరీఫ్ 49. ఎల్లి అరుణ 50. ఎండపల్లి భారతి.

Wednesday 14 November 2018

మళ్ళీ కథల సాయంత్రాలు ఒక తీపి కబురుతో

  జీవితం ఎప్పుడూ రెండు మైలురాళ్లు మధ్యే ఉంటుంది 
సూక్ష్మం గా చూస్తే చావు పుట్టుక 
స్థూలంగా చూస్తే 
చేసిన పని ,చేయాల్సిన బాధ్యత 
చేసిన పని అవార్డులుగా గుర్తింపు పొందితే 
చెయ్యాల్సిన పని దీపాన్ని పట్టుకోమంటుంది 
రెండు పట్టాల మీద బ్యాలెన్స్ గా వెళ్లగలిగినవాళ్లకే 
జీవితపు చప్పట్లు !!

పతంజలి గారి అవార్డు అందుకోబోతున్నందుకు 
ఖదీర్ బాబు గారికి అభినందనలు 
 
కథకుల కరచాలన వేళ మళ్ళీ వచ్చేసింది.
#writers' meet #kudali #yakshi